: తెలంగాణ సీఎం కేసీఆర్ పై లగడపాటి రాజగోపాల్ ప్రశంసల జల్లు!


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు, లగడపాటి రాజగోపాల్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకానొక సందర్భంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద రాజగోపాల్ పై తెలంగాణ వాదులు దాడి కూడా చేశారు. తదనంతర పరిణామాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం, కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎంగా గద్దెనెక్కడం జరిగిపోయాయి. ఇక రాష్ట్ర విభజన దరిమిలా రాజగోపాల్ ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కేసీఆర్ పై రాజగోపాల్ ప్రశంసలు జల్లు కురిపించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా నిన్న కరీంనగర్ జిల్లా మంథనిలో రాజగోపాల్ కుటుంబసమేతంగా పుష్కర స్నానమాచరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు బాగున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాట్లు చేయించడం అభినందనీయం’’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News