: రేవంత్ రెడ్డికి జైల్లో ఖైదీలే ధైర్యం నూరిపోశారట!
ఓటుకు నోటు కేసులో అరెస్టై నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి అక్కడి ఖైదీలే ధైర్యం నూరిపోశారట. ఈ విషయం వేరెవరో చెప్పింది కాదు, సాక్షాత్తు రేవంత్ రెడ్డే స్వయంగా వెల్లడించారు. నిన్న ఓ తెలుగు న్యూస్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. జైల్లో తనను వీఐపీ ఖైదీగా పరిగణించిన జైలు అధికారులు తనకు వంట మనిషిగా జీవిత ఖైదు పడిన నాగయ్య అనే ఖైదీని నియమించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా నాగయ్య తనతో చెప్పిన పలు అంశాలను రేవంత్ రెడ్డి సవివరంగా వివరించారు. ‘‘జైలుకే వచ్చారు. కేసీఆర్ ఇంకేం చేస్తాడు?’’ అని నాగయ్య తనలో ధైర్యం నింపారని చెప్పారు. అంతేకాక కేసీఆర్ కు, తనకు మధ్య జరుగుతున్న వైరాన్ని నాగయ్య విశ్లేషించిన తీరు ఇప్పటికీ గుర్తుకొస్తోందని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘‘సావుకు మించిన ధైర్యం లేదు.. గోసిగుడ్డకు మించిన దరిద్రం లేదు. మీ లాంటోళ్లు ఇంత దూరం రావొద్దు. జైలుకే వచ్చిండ్రు... ఇంక కేసీఆర్ మిమ్మల్ని ఏం చేస్తడు? ఏదైతే అదే జరుగుద్ది!’’ అంటూ తన గదిలో ఉన్న ముగ్గురు ఖైదీలు కూడా తనలో ధైర్యం నూరిపోశారని రేవంత్ రెడ్డి వివరించారు.