: నైతికత ఉంటే గవర్నర్ తప్పుకోవాలి... తలసానిపై 420 కేసు నమోదు చేయాలి: షబ్బీర్ అలీ
టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారం టీఆర్ఎస్ కు తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. రానున్న తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో శ్రీనివాస్ యాదవ్ రాజీనామా అంశాన్ని లేవనెత్తుతామని టీకాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీతి, నిజాయతీ ఉంటే తలసానిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని అన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడాల్సిన గవర్నర్ నరసింహన్ కూడా తలసాని అంశాన్ని సీరియస్ గా తీసుకోలేదని.... గత ఏడు నెలలుగా అన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు దానిపై యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని... కానీ ఆయన తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని అన్నారు. జరిగిన దానికి బాధ్యత వహిస్తూ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకొక్క నిమిషం కూడా గవర్నర్ పదవిలో కొనసాగే అర్హత నరసింహన్ కు లేదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసిన తలసానిపై వెంటనే 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.