: తలసాని రాజీనామా చేయలేదు... స.హ. చట్టం చెప్పిన వాస్తవం
తెలంగాణ మంత్రి, తెలుగుదేశం మాజీ నేత తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన రాజీనామా లేఖ తమకసలు అందనే లేదని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేయడం గమనార్హం. కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని ఈ సమాచారాన్ని పొందారు. మొత్తం విషయాన్ని పరిశీలిస్తే, గవర్నర్, ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నేతలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను తప్పు దారి పట్టించారని గండ్ర విమర్శించారు. కాగా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న తలసాని, టీఆర్ఎస్ పార్టీలో చేరేముందు తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించి, ఆ లేఖను మీడియాకు చూపిన సంగతి తెలిసిందే.