: 'హిట్లర్ సెల్యూట్'ను బ్రిటన్ రాణికి నేర్పిస్తున్న ఎడ్వర్డ్-8, బ్రిటన్ లో సంచలనం సృష్టించిన 1930 నాటి చిత్రం
అది 1930వ దశకంలో తీసిన చిత్రం. ఇంతవరకూ ఎన్నడూ బయటకు రాలేదు. తాజాగా ఆ చిత్రాన్ని బ్రిటన్ లోని కొన్ని పత్రికలు శనివారం నాడు అత్యంత ప్రముఖంగా ప్రచురించాయి. ఈ చిత్రం ఆ దేశంలో సంచలనం కలిగించింది. ఇంతకీ ఆ చిత్రంలో ఏముందో తెలుసా? బ్రిటన్ కు బద్ధశత్రువైన జర్మనీ నియంత హిట్లర్ అభివాదం చేస్తున్నట్టుగా కుడిచేతిని పైకెత్తి రాజకుటుంబీకులు అభివాదం చేస్తున్నారు. ప్రస్తుత బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (89), ఆరేళ్ల వయసు పాపగా ఉండగా, ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్, ఆమె మేనమామ కింగ్ ఎడ్వర్డ్-8 దగ్గరుండి 'సెల్యూట్'ను నేర్పిస్తున్నారు. ఇదే చిత్రంలో ఎలిజబెత్-2 తల్లి, దివంగత బ్రిటన్ రాణి కూడా అదే విధంగా అభివాదం చేస్తున్నారు. ఈ చిత్రం ప్రచురించడం పట్ల బకింగ్ హామ్ ప్యాలెస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఫోటో ప్రచురించిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఫోటో పత్రికలకు ఎలా వెళ్లిందన్న విషయమై ప్యాలెస్ లో అంతర్గత విచారణ మొదలు పెట్టినట్టు ఓ అధికారి తెలిపారు. స్కాట్లాండులోని బాల్మోరల్ ఎస్టేటులో 1933 లేదా 1934 ప్రాంతంలో ఈ చిత్రాన్ని తీసి వుండవచ్చని ఫోటోను ప్రచురించిన 'ది సన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 'మన రాణి నాజీల సెల్యూట్ చేస్తోంది' అని 'డైలీ మెయిల్' ఫోటోను మొదటి పేజీలో ప్రచురించింది.