: ఇవేమి పుష్కరాలురా దేవుడా..!
పవిత్ర గోదావరి నదిలో పుష్కర స్నానం చేయడానికి వెళ్లిన భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పుష్కర ఘాట్లలో స్నానాలు చేసేందుకు నిన్న బయలుదేరిన వారు ఇప్పటికీ ఘాట్లకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. బాసర నుంచి నరసాపురం వరకూ ఇదే విధంగా ఉంది. కిలోమీటరు దూరం పాటు వాహనం వెళ్లాలంటే గంట నుంచి రెండు గంటల పాటు పట్టింది. ఈరోజు పుష్కర స్నానాల కోసం ఎవరూ రావద్దని అధికారులు కోరినప్పటికీ, భక్తులు ఆగలేదు. వరుస సెలవులకు తోడు పుష్కరాలకు ఆహ్వానం పలుకుతూ ఏపీ సర్కారు పాఠశాలలకు సోమ, మంగళవారాలు సెలవులు ఇవ్వడంతో రాజమండ్రికి చేరేందుకు యాత్రికులు తరలివస్తున్నారు. ఈ తెల్లవారుఝామున సైతం రాజమండ్రి మొదటి వంతెనపై ట్రాఫిక్ ఆగిపోగా, కొవ్వూరు దాటి 10 కి.మీ పైగా వాహనాలు ఆగిపోయాయి. మరోవైపు ప్రత్యేక రైళ్లు ఎప్పుడు గమ్యస్థానం చేరుకుంటాయో... ఎప్పుడు తిరిగి బయలుదేరుతాయో అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత రాత్రి 11 గంటల వరకూ అక్కడక్కడా కనిపిస్తూ, ట్రాఫిక్ ను నియంత్రించేందుకు యత్నించిన పోలీసులు, అధికారులు ఆపై కనిపించకపోవడంతో రాత్రంతా రోడ్లపై గడపాల్సి వచ్చిందని యాత్రికులు వాపోతున్నారు. ఇవేమి పుష్కరాలురా దేవుడా? అని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.