: నా తప్పేదైనా ఉంటే క్షమించండి...మీకోసం కష్టపడతాను: మహేష్ బాబు
గత సినిమాలో అభిమానులను నిరాశకు గురి చేశానని, అందులో తన తప్పు ఏదైనా ఉంటే క్షమించాలని మహేష్ బాబు అభిమానులను కోరాడు. హైదరాబాదులో జరిగిన 'శ్రీమంతుడు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తన ఆడియో వేడుకకు అతిథిగా వచ్చిన వెంకటేష్ అన్యయ్యకు ధన్యవాదాలు అన్నాడు. అలాగే దేవిశ్రీప్రసాద్ అంటే తనకు ఇష్టమని మహేష్ బాబు చెప్పాడు. ఈ సినిమాలోని 'జాగో జాగో' పాట తన కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని తెలిపాడు. కొరటాల శివ అద్భుతమైన రైటర్ అని, సినిమాను ఊహించిన దానికంటే గొప్పగా తీశాడని కితాబిచ్చాడు. ఆయనకు గొప్ప భవిష్యత్ ఉందని తెలిపాడు. జగపతి బాబు గారు తండ్రి పాత్ర గురించి చెప్పగానే చేస్తారని ఊహించలేదని, కానీ ఆయన ఒప్పుకోవడంతో సంతోషం కలిగిందని మహేష్ చెప్పాడు. కమల్ హాసన్ కి తాను పెద్ద ఫాన్ నని చెప్పిన మహేష్ బాబు, ఆయన కూతురుతో నటిస్తానని అస్సలు అనుకోలేదని చెప్పాడు. మంచి టాలెంట్ ఉన్న నటి అని శృతి హాసన్ అని ఆమెకు కితాబిచ్చాడు. నిర్మాతలు బాగా సహకరించారని, వారు మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలని ఆకాంక్షించాడు. సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ ధ్యాంక్స్ అని చెప్పాడు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లోనే ఉంటారని చెప్పాడు. అభిమానుల కోసం నిరంతరం శ్రమ పడతానని మహేష్ బాబు పేర్కొన్నాడు.