: ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఓసారి సొంత ఊరెళ్లాలని అనిపిస్తుంది: జగపతిబాబు
సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సొంత ఊరెళ్లాలని అనిపిస్తుందని ప్రముఖ నటుడు జగపతిబాబు తెలిపాడు. హైదరాబాదులో శిల్పకళావేదికలో జరిగిన 'శ్రీమంతుడు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఎన్నారైలు, ఊరు వదిలేసి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కర్తవ్యాన్ని బోధిస్తుందని అన్నాడు. గతంలో ఒక పెద్దహీరో మాట్లాడుతూ, దేవుడు అందమంతా మహేష్ బాబుకు ఇచ్చేశాడని అన్నాడని గుర్తు చేసుకున్నాడు. మహేష్ బాబుకు అందం మాత్రమే కాదని, గుణం, ఓర్పు, సహనం, అల్లరి, తుంటరితనం, పోకిరి, చిలిపితనం అన్నీ ఇచ్చాడని జగపతిబాబు చెప్పాడు. జగపతి బాబు అలా చెప్పినప్పుడు మహేష్ బాబు ముసిముసి నవ్వులతో సిగ్గుపడిపోయాడు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ఏడుగురు హీరోలు, హీరోయిన్లు ఉన్నారని, సినిమా మల్టీస్టారర్ సినిమా అని అన్నాడు. కాకపోతే వారంతా గతంలో హీరోలుగా నటించిన వారని జగపతి బాబు చెప్పాడు. అభిమానులందరికీ మహేష్ బాబు బాబైతే, మహేష్ బాబుకి నేను బాబునని జగపతి బాబు చెప్పాడు. ఈ డైలాగ్ కు మహేష్ అభిమానులంతా కేరింతలు కొట్టారు.