: 'ఆప్' క్యాంటీన్లు వస్తే మా బతుకేంగాను దేవుడా!: ఢిల్లీలో చిరువ్యాపారుల ఆక్రోశం
తమిళనాడు తరహాలో ఢిల్లీలోనూ బడ్జెట్ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించడం తెలిసిందే. ఈ క్యాంటీన్లు వస్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని ఢిల్లీలో చిరువ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తోపుడు బండ్లపై అల్పాహారం విక్రయించే వీరు, ఇకపై తమకు జీవనోపాధి ఉండదని వాపోయారు. ఆప్ సర్కారు నెలకొల్పబోయే క్యాంటీన్లలో రూ.5, రూ.10 ధరల్లో నాణ్యమైన, పౌష్టిక విలువలున్న ఆహారం అందించాలని కేజ్రీ నిర్ణయించారు. ఈ క్యాంటీన్లు గనుక రంగప్రవేశం చేస్తే ఇక దుకాణం మూసివేత మినహా చేయగలిగిందేమీ లేదని రాజధాని చిరువ్యాపారులు భావిస్తున్నారు. సర్కారు క్యాంటీన్లతో పోటీ పడి రేట్లు తగ్గిస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారు. ఇన్నాళ్లు పోలీసులకు, మున్సిపల్ సిబ్బందికి మామూళ్లు చెల్లిస్తూ బండి లాక్కొచ్చిన ఈ చిరువ్యాపారులకు ఆప్ సర్కారు నిర్ణయం నిజంగా చేదు గుళిక వంటిదే.