: ఆన్ లైన్ డాక్టర్...అప్రమత్తత అవసరం


ఆఫీస్ లో పని ఒత్తిడి, ఇంట్లో ఫీజుల టెన్షన్ దీంతో తల నొప్పివచ్చేసింది. దానికి తోడు ఒంట్లో నలతగా ఉంది. డాక్టర్ దగ్గరి కెళ్లడానికి ఓపిక లేదు. దీంతో స్మార్ట్ ఫోన్ తీసి ఆన్ లైన్ యాప్ ఓపెన్ చేసి వైద్యుడ్ని సంప్రదించారు. మీ సమస్య మొత్తం అతనికి వివరించారు. ఆయన మీకు సరిపడా మందులు ప్రిస్క్రిప్షన్ రాశాడు. మరో యాప్ ఓపెన్ చేసి మందులు ఆన్ లైన్ లో తెప్పించుకున్నారు. హాయిగా నిట్టూరుస్తున్నారా? ఇక్కడే అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు ఆన్ లైన్ లో ఉచితంగా సేవలందించే వైద్యుడు ఉచితంగా సేవచేయడం లేదు. ఆ యాప్ కలిగిన సంస్థ అతనికి జీతం చెల్లిస్తుంది. దీంతో ఆ వైద్యుడు ఆ ఆన్ లైన్ సంస్థ అందించే మందులను మాత్రమే ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు. మనకు సరఫరా చేసిన మందులు వినియోగ పరిమిత కాలం ముగిసినవా?, భారతీయ మార్కెట్ లో వీటి వినియోగాన్ని అనుమతించారా? అనే విషయాలు రోగికి తెలిసే అవకాశం లేదు. దీంతో భారీ వ్యాపారం ఆన్ లైన్ లో జరిగిపోతుంది. అవి సరైనవి కానిపక్షంలో పెను ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ మధ్యే మహారాష్ట్రలో ఇలాంటి ఆన్ లైన్ వ్యాపార సంస్థను డ్రగ్ ఇన్ స్పెక్టర్లు రోగుల్లా సంప్రదించారు. భారతీయ మార్కెట్ లో నిషేధించిన 45 రకాల మందులను ఆన్ లైన్ లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. మందుల షాపుల్లోని మందులను పరీక్షించేందుకు సరిపడా డ్రగ్ అధికారులు అందుబాటులో లేరని, ఆన్ లైన్ వ్యాపార సంస్థలు అందించే మందుల తనిఖీలు చేసేందుకు కష్టమవుతోందని, దీనిని ఆన్ లైన్ వ్యాపార సంస్థలు అవకాశంగా మలచుకుంటున్నాయని, అందుకే వినియోగదారులే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News