: ప్రత్యూషను పరామర్శించిన కేసీఆర్ దంపతులు


సవతి తల్లి దాష్టీకానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరామర్శించారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఎల్బీ నగర్ గ్లోబల్ అవేర్ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బాలికను కలిసి మాట్లాడారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని చూడగానే ఆ బాలిక మోముపై నవ్వులు విరబూశాయి. కాగా, ప్రత్యూష విషయం తెలిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పూర్తి బాధ్యత తనదే అని ప్రకటించారు. ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి వారం రోజులు ఆతిథ్యమివ్వాలని నిర్ణయించుకున్నారు కూడా. ప్రత్యూష విషయం హైకోర్టులో ఉన్నందున, కోర్టు నిర్ణయాన్ని అనుసరించి ఆ అమ్మాయి భవిష్యత్తుకు రూపకల్పన చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. అటు, అందరూ ఉన్నా అనాథలా మిగిలిపోయిన ప్రత్యూషకు కొత్త జీవితం ఇస్తామంటూ ఎందరో ప్రముఖులు ముందుకురావడం తెలిసిందే. నటుడు పోసాని కృష్ణమురళి, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News