: విద్యాలయాల్లో కుల సంఘాలేంటి?... నాగార్జున వర్సిటీలో ‘కుల బోర్డు’లు పీకేయించిన గంటా
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కుల సంఘాలతో కంపు కొడుతోందట. నేటి ఉదయం వర్సిటీకి వచ్చిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుల సంఘాలపై విస్మయం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం సీనియర్ల వేధింపులతో వరంగల్ జిల్లాకు చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు స్వయంగా వర్సిటీకి వచ్చిన గంటా... వర్సిటీ అధికారులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీలో కుల సంఘాలు ప్రతి చిన్న విషయంలోనూ తలదూర్చి గగ్గోలు పెడుతుండటం ఆయన దృష్టికి వచ్చింది. అంతేకాక కొందరు విద్యార్థుల గదుల ముందు కుల సంఘాల బోర్డులూ కనిపించాయట. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన గంటా, అక్కడికక్కడే సిబ్బందితో సదరు బోర్డులను పీకేయించారట. ఇకపై వర్సిటీలో కుల సంఘాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.