: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ కొత్త చైర్మన్ కు ఆర్ఎస్ఎస్ బాసట
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ టీఐఐ) నూతన చైర్మన్ గా నటుడు, బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ నియామకంపై వస్తున్న వ్యతిరేకతకు ఆర్ఎస్ఎస్ చెక్ పెట్టింది. ఆయనకు మద్దతు తెలుపుతూ ఆర్ఎస్ఎస్ వారపత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురించింది. చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న వారు హిందూమత వ్యతిరేకులని పత్రిక నిర్వాహకులు పేర్కొన్నారు. మానసికంగా వికలాంగులైన వారే చౌహాన్ నియామకాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పింది. ఇక ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ ఎఫ్ టీఐఐ విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడం కుట్రపూరితమేనని వ్యాఖ్యానించింది. ఎఫ్ టీఐఐ పదవిలో ఉండేందుకు చౌహాన్ కు సరైన అర్హత, అనుభవం లేవంటూ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ, దాదాపు ఆయన 150 సినిమాల్లో, 600 టీవీ సీరియళ్లలో నటించారని, సినీ పరిశ్రమలో 34ఏళ్ల అనుభవం ఉందని ఆర్ఎస్ఎస్ పత్రిక పేర్కొంది. ఇలా చౌహాన్ నియామకాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికీ ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పింది. ఇటీవల బాలీవుడ్ నటులు రిషీ కపూర్, సల్మాన్ ఖాన్ పలువురు ఆయన నియామాకాన్ని ప్రశ్నించారు.