: ఓ చేత్తో ప్రాణం తీస్తాడు... మరో చేత్తో ప్రాణం పోస్తాడు!
జోక్విన్ 'ఎల్ చాపో' గుజ్మాన్.... మెక్సికో పోలీసులకు అత్యంత అసహ్యకరమైన పేరిది! అదే సమయంలో, మెక్సికోలోని సినాలోవా రాష్ట్రం మాత్రం ఆ పేరు వింటే చాలు పులకించిపోతుంది! ఎందుకింత వైరుధ్యం? అని ప్రశ్నించుకుంటే... సమాధానం చాలా సింపుల్ గా సాక్షాత్కరిస్తుంది. గుజ్మాన్ ఓ డ్రగ్ లార్డ్. మెక్సికోలోనే కాదు, ప్రపంచం నలుమూలలా ఆయన మాదకద్రవ్యాల వ్యాపారం వేళ్లూనుకుని ఉంది. దాంతో, గుజ్మాన్ మెక్సికో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. అయితే, ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకున్నాడు, తాను ప్రత్యక్షంగా కనిపించడు... దేవుడిలా ఎవరినో ఒకరిని పంపి సాయం అందిస్తాడు. అదే గుజ్మాన్ స్టయిల్. సీన్ కట్ చేస్తే... సొంత రాష్ట్రం సినాలోవాలో దేవుడయ్యాడు. అతడి డ్రగ్స్ కొందరి ప్రాణాలను హరించి వేస్తాయి, అతని దానధర్మాలు కొందరి ప్రాణాలు నిలబెడతాయి. అందుకే అంటారంతా... ఓ చేత్తో ప్రాణం తీస్తాడు, మరో చేత్తో ప్రాణం పోస్తాడు అని! ఇప్పుడిదంతా ఎందుకంటే... కొన్ని రోజుల క్రితం మెక్సికోలో అత్యంత పటిష్ట భద్రత కలిగివుండే జైలు నుంచి ఓ సొరంగం ద్వారా తప్పించుకున్నాడీ డ్రగ్ లార్డ్. అతడి కోసం మెక్సికోలో అత్యంత భారీ స్థాయిలో వేట సాగుతోంది. భారీ భద్రత ఉండే జైలు నుంచి విజయవంతంగా తప్పించుకోవడంతో గుజ్మాన్ ఓ దైవాంశ సంభూతుడి స్థాయికి ఎదిగిపోయాడు సినాలోవా వాసుల హృదయాల్లో. మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో కంటే 'ఎల్ చాపో'నే తమకు ఎక్కువ అని సినాలోవా రాష్ట్రీయులు బహిరంగంగా చెప్పేస్తారు. దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతడి హవా ఏ రీతిలో వీస్తుందో. "ప్రతి ఒక్కరూ జైలు నుంచి గుజ్మాన్ తప్పించుకోవాలనే కోరుకున్నారు. నా దృష్టిలో ఆయన ప్రెసిడెంట్ కంటే ఎక్కువ. ప్రభుత్వంలో ఆయనకు బాగా పట్టున్నట్టుంది" అని బుక్నాస్ డి కులియకాన్ (యూఎస్-మెక్సికన్ మ్యూజిక్ గ్రూప్) సభ్యుడు జైమీ కరిల్లో పేర్కొన్నాడు. "రాజకీయ నాయకుల కంటే గుజ్మాన్ ఎంతో బెటర్. పన్నుల రూపంలో మా సంపాదనను కొల్లగొట్టకుండా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించాడు. అతడిని జైల్లో పెట్టిన అవినీతి మూక కంటే అతడే మేలు కదా! అతడు వాళ్ల కంటే తెలివైనవాడు, అందుకే తప్పించుకున్నాడు" అని క్లాడియా శాంచెజ్ అనే షాప్ వర్కర్ వివరించారు.