: కేసీఆర్ కు షాకిచ్చిన సీనియర్ ఐఏఎస్... సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టిన వైనం!
పాలనాపరమైన అనుభవం లేకపోవడమో, అనుయాయులకు పదవులు కట్టబెట్టాలన్న ఆత్రుతో తెలియదు కాని పాలకులు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో నిబంధనలు కూడా పాటించాలిగా. కొన్నిసార్లు నిబంధనలు పాటిస్తూ తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సమయాల్లోనే పాలనలో కీలక భూమిక పోషించే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ తరహా అప్రమత్తత కొన్నిసార్లు పాలకులు, అధికారులకు మధ్య పెద్ద అగాధాన్నే సృష్టిస్తోంది. ఇలాంటి ఘటనే ఈ మధ్య తెలంగాణలో జరిగింది. అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. వివరాల్లోకెళితే... రాష్ట్ర విభజన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ, తెలంగాణ వైద్యసేవలు,మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. ఇటీవల ఈ రెండు పోస్టుల్లో అధికారుల నియామకానికి సీఎం హోదాలో కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా సాంఘిక సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ ను ఖరారు చేస్తూ ఫైలుపై కేసీఆర్ సంతకం కూడా చేసేశారు. ఇక పాలనాపరమైన అనుమతి కోసం ఆ ఫైలు వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా వద్దకెళ్లింది. సాధారణంగా ఈ రెండు పోస్టులలో ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉంది. అయితే కేసీఆర్ ఎంపిక చేసిన ఇద్దరు అధికారులు కూడా నాన్ ఐఏఎస్ లే. దీంతో సురేశ్ చందా ఆ ఫైలును తిరస్కరించి, కేసీఆర్ కార్యాలయానికి తిప్పి పంపారు. ‘‘మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించండి’’ అంటూ సదరు ఫైల్ పై సురేశ్ చందా నోట్ రాశారట. మరి దీనిపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.