: ఉన్నదున్నట్టు చెప్పండి... అవతల విపక్షాలు కాసుక్కూర్చున్నాయి: వ్యాప్కోస్ పై హరీశ్ ఆగ్రహం
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నిన్న ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సంస్థ వ్యాప్కోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నివేదికలు చేరకముందే సాగునీటి ప్రాజెక్టుల వివరాలు బయటకెలా పొక్కుతాయని ఆయన ఆ సంస్థ ప్రతినిధులను నిలదీశారు. నిన్న సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమావేశానికి హరీశ్ రావుతో పాటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, వ్యాప్కోస్ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు చెప్పిన విషయాలను తారుమారు చేస్తూ వ్యాప్కోస్ చెబుతున్న వైనంపై ఆగ్రహంగా వున్న హరీశ్ రావు, భేటీ ముగిసేదాకా ఓపిగ్గానే ఉన్నారు. సమీక్ష ముగిసి కేసీఆర్ ఛాంబర్ నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘ప్రభుత్వానికి వివరాలు అందకముందే మేడిగడ్డ ముంపు, కాళేశ్వరం-ఎల్లంపల్లి వివరాలు బయటకు ఎలా వెళ్లాయి? మీరు టెక్నికల్ కన్సల్టెంట్ సంస్థగా వ్యవహరించాలి. సీఎం గారు పూర్తిగా మీపైనే ఆధారపడి ఉన్నారు. చర్చలు జరిగేటప్పుడు వాస్తవాలు చెప్పండి. ముందేమో ముంపు లేదంటారు. ఇప్పుడేమో ఉందంటున్నారు. ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. ఏదైనా తప్పు జరిగితే విమర్శించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పండి’’ అని ఆయన వారిపై విరుచుకుపడ్డారు.