: రాజమండ్రి, కొవ్వూరుకు పోటెత్తిన పుష్కర యాత్రికులు... కిక్కిరిసిన ఘాట్ లు
ఆంధ్రప్రదేశ్ లో ఐదవరోజు గోదావరి పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరుకు భక్తజనం పోటెత్తారు. ఘాట్ ల నిండా ఇసకవేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. నేడు, రేపు సెలవులు కావడంతో పలు జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ లో రద్దీ భారీగా ఉంది. ఇక కొవ్వూరులోని 10 ఘాట్లలో భక్తులు కిక్కిరిసారు. పట్టిసీమకు పుష్కర భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారని, ఉదయం 10 గంటలవరకు 10 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్టు అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న భక్తులకు తగ్గట్టుగా ప్రభుత్వం ముందుగానే ఏర్పాట్లు చేసింది. బారికేడ్లు పెట్టి వరసప్రకారం భక్తులు ఘాట్ లకు వెళ్లేట్టుగా చూస్తున్నారు. మరోవైపు పుష్కర ఘాట్ లకు వచ్చే వాహనాలు బారులు తీరాయి.