: రాణించిన బౌలర్లు...టీమిండియా విజయం
తొలి టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. తొలుత టాస్ గెలిచిన టీమిండియా మురళీ విజయ్ (34), కెప్టెన్ రహానే (33), రాబిన్ ఊతప్ప (39) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వేను టీమిండియా బౌలర్లు ఏ దశలోనూ స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. 54 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లలో మసకద్జ (28), చిబాబా (23), కావెంట్రీ (10), సికందర్ రజా (10) రాణించగా, చివర్లో ఉత్సేయ (13), మద్జీవా (14) ధాటిగా ఆడారు. దీంతో జింబాబ్వే మెరుగైన పరుగులు సాధించింది. టీమిండియా బౌలర్లలో మూడు వికెట్లతో అక్షర పటేల్ రాణించగా, అతనికి రెండు వికెట్లతో హర్భజన్ సింగ్, ఒక వికెట్ తో మోహిత్ శర్మ చక్కని సహకారమందించారు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన సందీప్ శర్మ సంధించిన తొలి బంతిని సిక్స్ గా మలిచిన మసకద్జ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఘన స్వాగతం పలికాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అక్షర పటేల్ నిలిచాడు.