: రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పిన తరువాతే అడుగుపెట్టాలి: అనంతపురం ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చేసి తప్పు చేశామని ఒప్పుకుని, ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పిన అనంతరం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో ప్రవేశించాలని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఏ విధమైన కసరత్తు లేకుండా, సమస్యలు పరిష్కరించకుండా ఏకపక్షంగా విభజించి, రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టిన రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ లో పర్యటించడాన్ని ఇక్కడి ప్రజలు అంగీకరించరని అన్నారు. అనంతపురంలో ల్యాండ్ మాఫియాను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కబ్జాలకు పాల్పడితే టీడీపీ నేతలను కూడా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.