: స్మార్ట్ ఫోన్లపై మీకుండే అపోహలు... అసలు నిజాలు!
ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా దాని పనితీరుపై కొన్ని అపోహలు, అనుమానాలు కలగడం సహజం. స్మార్ట్ ఫోన్ల విషయంలోనూ అంతే. స్మార్ట్ ఫోన్లు పర్సనల్ కంప్యూటర్లంత పాతవి కాదు. మన కళ్ల ముందు వచ్చినవే. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల విషయంలో ఉన్న అపోహల వెనకున్న అసలు నిజాలివి... అపోహ: ఎక్కువ మెగా పిక్సల్ అయితే, మంచి కెమెరా ఉన్నట్టు. వాస్తవం: తీసే చిత్రంలో ఉన్న స్పష్టతకు, ఫోన్ కెమెరా ఎంత మెగాపిక్సల్ అన్న విషయానికీ సంబంధం లేదు. ఎక్కువ ఎంపీ కెమెరా ఉంటే చిత్రాలను మరింత పెద్దవిగా ప్రింట్లు తీసుకోవచ్చు. అంతే తప్ప చిత్రంలో క్లారిటీ అనేది కెమెరా లెన్స్ పై ఆధారపడి వుంటుందని తెలుసుకోండి. అపోహ: బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంటే ఫోన్ ఎక్కువ సేపు పనిచేస్తుంది. వాస్తవం: బ్యాటరీ ఎంఏహెచ్ అధికంగా ఉన్నంత మాత్రాన ఫోన్ చార్జింగ్ అయిపోకుండా మరింత సమయం ఉంటుందని భావించకూడదు. బ్యాటరీ ఖర్చు కావడం అన్నది పలు ఇతర కారణాలపైనా ఆధారపడి వుంటుంది. ఫోన్ లోని ప్రాసెసర్, వాడుతున్న యాప్స్, డేటా రాకపోకలు, కెమెరా స్క్రీన్ వంటివెన్నో బ్యాటరీ లైఫ్ ను నిర్దేశిస్తాయి. ఉదాహరణకు, ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ తో పోలిస్తే క్వాడ్ కోర్ క్వాల్ కాం ప్రాసెసర్ తక్కువ బ్యాటరీని వాడుకుంటుంది. అపోహ: ఎన్ని 'కోర్'లుంటే అంత మంచి పనితీరు. వాస్తవం: ఉదాహరణకు 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఆసుస్ జన్ ఫోన్-2 బ్యాటరీ ఒక్క రోజు కూడా రాదు. ఇదే సమయంలో 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే మైక్రోమ్యాక్స్ యూ యురేకా ఒకటిన్నర రోజు నిలుస్తుంది. దీనికి కారణం ప్రాసెసర్. డ్యూయల్ కోర్ రోజులు పోయి, క్వాడ్ కోర్, ఆక్టా కోర్ అంటూ స్మార్ట్ ఫోన్ యూజర్లు పాకులాడుతున్న వేళ ఎన్ని 'కోర్'లుంటే అంత గొప్ప పనితీరును స్మార్ట్ ఫోన్ చూపుతుందని భావించడం తప్పే. అపోహ: లైవ్ వాల్ పేపర్లు, ఆటోమేటిక్ బ్రైట్ నెస్, బ్లూటూత్ బ్యాటరీ జీవితకాలాన్ని నాశనం చేస్తాయి. వాస్తవం: లైవ్ వాల్ పేపర్లు, ఆటోమేటిక్ బ్రైట్ నెస్, బ్లూటూత్ తదితరాలు బ్యాటరీలో చార్జింగును తినేస్తాయి తప్ప దాని జీవితకాలాన్ని నాశనం చేయవు. పలు రకాల పరీక్షల అనంతరం తేల్చిందేమంటే, ఇవన్నీ వాడితే కేవలం 2 శాతం మాత్రమే బ్యాటరీ అధికంగా ఖర్చవుతుంది. అపోహ: ఫోన్ కు దగ్గరలో మాగ్నెట్లుంటే, సమాచారం తుడిచిపెట్టుకు పోతుంది. వాస్తవం: మీరు అనుకుంటున్నది హార్డ్ డ్రైవ్ ల విషయంలో కొంతవరకూ నిజమే. కానీ, స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే, యూజర్లు వాడే ఎస్ఎస్ డీ (సాలిడ్ స్టేట్ డ్రైవ్)లు అయస్కాంతాలకు ఆకర్షింపబడవు. అందువల్ల మ్యాగ్నెట్ల ప్రమాదం వీటిపై ఉండదు.