: ఐపీఎల్ కొత్త టీములపై కన్నేసిన అమేజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్!


చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత, ఈ రెండు టీములనూ రెండేళ్ల పాటు నిషేధించినట్టు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తీర్పిచ్చిన నేపథ్యంలో మరో రెండు కొత్త టీములు తెరపైకి రానున్నాయి. ఫ్రాంచైజీ పేరు ఏదైనా తమ బ్రాండ్ ఇమేజ్ ని మరింతగా పెంచుకునేందుకు ఐపీఎల్ సహకరిస్తుందన్న ఆలోచనలతో పలు కార్పొరేట్ కంపెనీలు కొత్త ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు తమవంతు యత్నాలు ప్రారంభించాయి. హీరో మోటో కార్ప్, జేఎస్ డబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తాము రంగంలో ఉన్నామన్న సంకేతాలను పంపగా, తాజాగా, ఈ-కామర్స్ బూమ్ లో భారీగా లాభపడి, నిల్వ నిధులను పుష్కలంగా పెంచుకున్న అమేజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, పేటీఎం తదితర కంపెనీలు ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. కొత్త టీములు ఏ ప్రాంతానికి వస్తాయో చూసిన తరువాత తాము ముందడుగు వేస్తామని సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి వివరించారు. ఇండియాలో తమ బ్రాండ్ పేరును మరింతగా విస్తరించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీల కొనుగోలు తప్పక సహకరిస్తుందని, అందువల్లే కొత్త టీముల లభ్యతను నిశితంగా పరిశీలిస్తున్నామని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాథ్ వ్యాఖ్యానించారు. బిడ్డింగ్ విధానం ఎలా ఉంటుందో తెలుసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ-కామర్స్ దిగ్గజాలుగా ఉన్న అమేజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర సంస్థలు సైతం ఇదే విధమైన అభిప్రాయాలతో ఉన్నాయి. తమ వద్ద ఫ్రాంచైజీని కొనేంత నగదు ఉందని, కొత్త టీములు కాస్తంత చౌకగా లభిస్తే, అవకాశాన్ని వదులుకోబోమని ఓ ఈ-కామర్స్ సేవల సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

  • Loading...

More Telugu News