: పదేళ్లు ఎదురుచూసి, విసిగి వేసారి... రూ. 72 వేల కోట్ల ప్రాజెక్టు తమకొద్దంటున్న పోస్కో!
సాలీనా 1.2 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా, 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 72 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టి ఒడిశాలో పరిశ్రమను స్థాపించాలని ఎంతో తపించిన సౌత్ కొరియన్ దిగ్గజం పోస్కో వెనుదిరగనుంది. ఒడిశాలోని గిరిజనుల నుంచి వస్తున్న నిరసనలకు తోడు, భూ సమీకరణ పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. సుమారు పదేళ్ల క్రితమే పోస్కో, ఒడిశాల మధ్య భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం ఒప్పందం కుదరగా, అప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో మారిన చట్టాలు తమ అంచనా వ్యయాన్ని మరింతగా పెంచాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2005 సంవత్సరంలో, దేశ చరిత్రలోనే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని తీసుకువస్తున్న సంస్థగా పోస్కోను అందరూ అభినందించారు. త్వరితగతిన అనుమతులిస్తామని యూపీఏ-1 సర్కారు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతించింది. ఆపై అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒడిశాలో సర్కారు మారడం, పర్యావరణ అనుమతుల జాప్యం, భూములు కోల్పోతున్న వారి నిరసనలు ఇలా పలు కష్టాలు పోస్కోను ముందడుగు వేయనీయకుండా ఆపాయి. మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత గత మార్చిలో మారిన గనుల చట్టం ప్రకారం, ఉక్కు పరిశ్రమ స్థాపించాలంటే, ఓ ఇనుప ఖనిజం గనిని సైతం వేలంలో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొనడంతో పోస్కో, ఈ ప్రాజెక్టు నుంచి మొత్తంగానే తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.