: దొంగ ఈత బలం చూపించబోతే... పోలీసులు బోటు బలం చూపారు!
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఈ ఉదయం ఆసక్తికర ఘటన జరిగింది. తమ చేతి వాటం ప్రదర్శించిన దొంగ నదిలో దూకి తనలోని ఈత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే, అతనిని గమనించిన పోలీసులు తమ వద్ద ఉన్న బోట్ల సత్తాను చూపారు. కాసేపు సినీ పక్కీలో సాగిన ఈ ఘటన వేలాది మంది చూస్తుండగా జరిగింది. ఓ మహిళ మెడలోని బంగారపు గొలుసును లాక్కెళ్లిన దొంగ ఒకడు, మెట్లెక్కి పైకి వెళ్లి పారిపోయే దారి లేక నదిలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి పారిపోయే ప్రయత్నం చేశాడు. వేగంగా ఈదుతూ ముందుకు కదిలాడు. మహిళ కేకలతో అప్రమత్తమైన పోలీసులు అక్కడే ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్లపై వెళ్లి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అక్కడికక్కడే మహిళ గొలుసును ఇప్పించి దొంగను స్టేషనుకు తీసుకెళ్లారు.