: తెలంగాణ సర్కారు రంజాన్ స్కీంపై షియా ముస్లింల అసంతృప్తి
రంజాన్ సందర్భంగా తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని ముస్లింలకు కానుకలు ఇవ్వాలని నిర్ణయించడం తెలిసిందే. మసీదుల ద్వారా ఆ కానుకలు పంపిణీ చేయనున్నారు. అయితే, ఆ పథకం పట్ల షియా ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ వర్గానికి చెందిన 48 మసీదులను ఈ పథకానికి ఎంపిక చేయలేదని తెలిపారు. ఆ మసీదులన్నీ వక్ఫ్ బోర్డు వద్ద రిజిస్టర్ అయ్యాయని, చార్మినార్ నియోజకవర్గంలో తమదే ప్రాబల్యం అయినా తమను విస్మరించడం తగదని అన్నారు. దీనిపై షియా యూత్ కమిటీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాసింది. యూత్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ హమీద్ హుస్సేన్ జాఫ్రీ మాట్లాడుతూ... ఈ మసీదులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న విషయమై సర్కారు విచారణ జరిపించాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.