: అమెరికా వెళ్లాల్సిన టెక్కీని తరుముకొచ్చిన మృత్యువు!


మరో వారంలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లేందుకు వీసా వస్తుందన్న ఆనందంలో ఉన్న ఆ యువకుడిని మృత్యువు తరుముకొచ్చింది. బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల నిమిత్తం యూఎస్ వెళ్లాలని కలలు కంటున్న మహ్మద్ సమీర్ (22), రోడ్డుపక్కనున్న వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చే క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొని మరణించి, తన ఇంట విషాదాన్ని నింపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నల్లగొండ జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ లో అసిస్టెంట్‌ ఇన్‌ స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న యూసఫ్ అలీ... హైదరాబాదు, వనస్థలిపురం పరిధిలోని ప్రశాంత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సమీర్ ఓ పని నిమిత్తం రామాంతపూర్ కు వచ్చాడు. అక్కడి నుంచి హబ్సీగూడా వెళుతుండగా, స్ట్రీట్ నంబర్ 8 వద్ద ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. అతన్ని ఎక్కించుకుంటుండగా, బైకు అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో దూసుకొచ్చిన లారీ సమీర్ పై నుంచి వెళ్లింది. దీంతో సమీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.

  • Loading...

More Telugu News