: మహిళ వెంటపడి వేధించిన తుంటరి ఉడుత... అరెస్టు చేసిన పోలీసులు
జర్మనీలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ ఉడుతను అరెస్టు చేశారు. ఉడుత చేసిన నేరం ఏంటంటే... ఆ మహిళ వెంటపడి వేధించడమే! జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని బోట్రాప్ నగరంలో సదరు మహిళ వీధిలో వెళుతుండగా ఓ ఉడుత వెంటపడింది. ఎంత అదలించినా పోలేదట. ఆమె చుట్టూనే తిరుగుతూ బాగా ఇబ్బందిపెట్టింది. దీంతో, ఆ పడతి చివరకు ఎమర్జెన్సీ కాల్ చేసింది. కాల్ అందుకున్న ఓ పోలీసు అధికారి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఆ ఉడుతను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఆ జీవిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు. ఇక, పీఎస్ లో ఆ ఉడుతకు ఓ ఆఫీసర్ మేత పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను ఫేస్ బుక్ లో పెట్టారు. ఆ ఉడుత బాగా అలసిపోయినట్టు కనిపిస్తోందని, శక్తి పుంజుకున్నాక దానిని రెస్క్యూ హోంకు తరలిస్తామని చెప్పారు.