: తాజ్ మహల్ వద్ద ఒకరి గొంతు ఒకరు కోసుకున్న ప్రేమికులు


పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట తాజ్ మహల్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అబ్బాయి పేరు రాజ్ వీర్ సింగ్ (25). డెహ్రాడూన్ నివాసి. అమ్మాయి పేరు షబ్నమ్. ఆగ్రాలో ఉంటుంది. ఇరువురూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని పెద్దలను ఒప్పించాలని విశ్వప్రయత్నం చేశారు. మతాలు వేరు కావడంతో ఏ కుటుంబంలోనూ పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో వీరు నిన్న సాయంత్రం తాజ్ మహల్ వద్దకు వచ్చి ఒకరి గొంతును ఒకరు బ్లేడుతో కోసేసుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు వారిని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తాను, షబ్నమ్ వివాహం చేసుకోవాలని భావించి, ఇంట్లో పెద్దలకు ఎంతో నచ్చజెప్పామని, మతం తమ మధ్య అతిపెద్ద అవరోధంగా నిలిచిందని రాజ్ వీర్, మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపాడు. మరో మార్గం కనిపించకనే ఆత్మహత్యకు ప్రయత్నించామని తెలిపాడు. తమ కులాల్లోని మత పెద్దలను కలిసినా ఎటువంటి స్పందనా రాలేదని వాపోయాడు. ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ వద్ద ప్రేమికుల ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిపై హత్యాయత్నం కేసును పెట్టి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News