: కల నిజమవుతుంది... పేదలకు సంవత్సరానికి ఒకసారి విమాన ప్రయాణం: మోదీ కొత్త ఆలోచన
గాల్లో వెళుతున్న విమానాన్ని చూస్తూ, సంబరపడే రోజుల నుంచి ఆ విమానం ఎక్కి తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి వచ్చే అవకాశం కోట్లాదిమంది ప్రజలకు దక్కనుంది. ఆమ్ ఆద్మీ (సామాన్యుడు) తనకు తాను నెరవేర్చుకోలేని కోరికల్లో విమాన ప్రయాణం ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కలను నెరవేర్చేందుకు మోదీ సర్కారు ఓ సరికొత్త ప్లాన్ రూపొందించింది. త్వరలో విడుదల కానున్న పౌరవిమానయాన విధానంలో మధ్యతరగతి కుటుంబానికి సంవత్సరంలో కనీసం ఒకసారి విమాన ప్రయాణాన్ని దగ్గర చేసేలా కొత్త నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ విషయాన్ని విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి జి.అశోక్ కుమార్ వెల్లడించారు. దీని గురించి మరింత సమాచారాన్ని ఆయన వెల్లడించనప్పటికీ, టెలికం రంగంలో వచ్చిన మార్పు ప్రజలకు సెల్ పోన్ ను దగ్గర చేసినట్టుగానే, సివిల్ ఏవియేషన్ రంగంలో మార్పులు రానున్నాయని ఆయన అన్నారు. ఈ నెలాఖరులోగా కొత్త నిబంధనలపై స్పష్టత వస్తుందని వివరించారు.