: క్యాబ్ డ్రైవర్ల వెధవ పనులపై కంపెనీలను ఎందుకంటారు?: ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, జోరుగా చర్చ


దేశ రాజధానిలో పలు క్యాబ్ సంస్థల డ్రైవర్లపై వస్తున్న ఆరోపణల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందిస్తున్న సంస్థలకు ఊరట కలిగించింది. డ్రైవర్లు చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై క్యాబ్ సంస్థలను బాధ్యులను చేయడం భావ్యం కాదని అభిప్రాయపడింది. ఓ డ్రైవరుకు ఆల్ ఇండియా పర్మిట్ (ఏఐపీ)ను రవాణా శాఖ అధికారులు ఇచ్చిన తరువాత, అతనిని విధుల్లోకి తీసుకున్న కంపెనీని బాధ్యులను చేయరాదని వ్యాఖ్యానించింది. అధికారులు ఓ క్రిమినల్ కు ఏఐపీ ఇచ్చారన్న విషయాన్ని తొలుత పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం వివరించింది. క్యాబ్ సేవలు నగరంలోని ఓ చోటి నుంచి మరో చోటికి మాత్రమే అందుబాటులో ఉంటాయని, అవి నగర పరిధిని దాటడం లేదని గమనించాలని జడ్జి మన్మోహన్ వ్యాఖ్యానిస్తూ, క్యాబ్ సంస్థలు తమ వాహనాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) తదితర అధునాతన సాంకేతికతను వాడుతున్నాయని, చౌకగానూ ప్రయాణ సేవలు ప్రజలకు దగ్గరయ్యాయని గుర్తుంచుకోవాలని అన్నారు. ఢిల్లీ నగరంలో డీజిల్ వాహనాలను నడిపించేందుకు తాను అంగీకరించనని, సీఎన్జీ మాత్రమే క్యాబ్స్ వాడాలని కూడా అన్నారు. ఓలా బ్రాండ్ పేరిట క్యాబ్ సేవలందిస్తున్న ఏఎన్ఐ టెక్నాలజీస్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న అనంతరం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లలో చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News