: 80 ఏళ్ల తరవాత మెక్సికోలో ముడిచమురు వేలం... ఓఎన్జీసీ దక్కించుకుంటే అదృష్టమే!
సుమారు 80 సంవత్సరాల తరువాత మెక్సికో తన దేశంలోని అపార చమురు సంపదను వెలికితీసేందుకు విదేశీ కాంట్రాక్టులను ఆహ్వానిస్తూ, వేలం ప్రారంభించింది. దేశ ఇంధన రంగ సంస్కరణల్లో భాగంగా, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 17 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 72 వేల కోట్లు) విలువైన 14 చమురు క్షేత్రాలను వేలానికి ఉంచింది. కాగా, ఈ గనులను దక్కించుకోవడానికి యూఎస్ చమురు దిగ్గజం ఎక్సన్ మొబిల్, చెవరాన్, ఆంగ్లో-ఆస్ట్రేలియన్ సంస్థ బీహెచ్పీ బిలిట్టన్, భారత చమురు దిగ్గజం ఓఎన్జీసీ అనుబంధ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్, రష్యాకు చెందిన లుకోయిల్, ఫ్రాన్స్ కు చెందిన టోటల్, చైనాకు చెందిన నెక్సిన్ తదితర కంపెనీలు విడివిడిగా బిడ్లను దాఖలు చేశాయి. ఈ చమురు క్షేత్రాలను గెలుచుకున్న కంపెనీలు భవిష్యత్తులో మంచి లాభాలను సాధిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తుండటంతో పోటీ అధికంగా ఉంది. అయితే, గత ఏడాదిగా చమురు ధరలు పతనం కావడం ఈ రంగంలోని కంపెనీల విస్తరణ ప్రణాళికల అమలును ఆలస్యం చేస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ గనుల్లో సాధ్యమైనన్నింటిని దక్కించుకోవాలని భావిస్తున్న ఓఎన్జీసీ ఇప్పటికే అధికారుల బృందాన్ని మెక్సికోకు పంపి చమురు క్షేత్రాల పరిశీలనను పూర్తి చేసింది.