: ‘వ్యాపం’ కేసులో ఒక్క చార్జీషీటూ దాఖలు కాలేదట!... సుప్రీంకోర్టుకు సీబీఐ ఫిర్యాదు
మధ్యప్రదేశ్ లో పురుడుపోసుకుని దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వ్యాపం కుంభకోణంపై ఇప్పటిదాకా ఒక్క చార్జీషీటూ దాఖలు కాలేదట. ఏళ్ల తరబడి సాగిన ఈ కేసులో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారాయి. వేలాది మంది అక్రమార్కులకు సర్కారీ కొలువులు, ఉన్నత విద్యకు సంబంధించిన సీట్లు లభించాయి. దీంతో ఈ భారీ కుంభకోణంపై దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. దాదాపు 185 కేసులను నమోదు చేసిన సిట్, ఇప్పటిదాకా ఒక్క కేసులోనూ కోర్టులో చార్జీషీటు దాఖలు చేయలేదు. ఇటీవల ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీబీఐ కొద్దిసేపటి క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో నమోదు చేసిన కేసులకు సంబంధించి చార్జీషీట్లను దాఖలు చేసేలా సిట్ కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును సీబీఐ కోరింది. చార్జీషీట్లు దాఖలు కాకుంటే, నిందితులకు కోర్టుల్లో అత్యంత సులువుగా బెయిల్ మంజూరవుతుందని కూడా సీబీఐ తన పిటీషన్ లో పేర్కొంది. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఈ నెల 20న విచారించనున్నట్లు ప్రకటించింది.