: వేలు దాటి లక్షల్లోకి చేరిన అమ్ముడుపోని అపార్టుమెంట్ల సంఖ్య... అయినా ధర తగ్గదేం?


దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలోని థానే, నవీ ముంబై రీజియన్లలో సుమారు 77,460 అపార్టుమెంట్లు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. కేవలం ముంబైలో మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. అమ్ముడుపోని అపార్టుమెంట్ల సంఖ్య లక్షల్లోకి పెరిగింది. నిర్మాణం ప్రారంభించి, మధ్యలో వదిలేసిన లెక్క కూడా పరిగణనలోకి తీసుకుంటే వీటి సంఖ్య మరింత ఎక్కువ. కొనేవాళ్లు లేకపోయినా, ధరలు అనుకున్నంతగా తగ్గలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలుదారులు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణమని జెఎల్ఎల్ ఇండియా డైరెక్టర్ అశుతోష్ లిమాయే వివరించారు. అడ్వాన్సులిచ్చిన తరువాత డెవలపర్ల ఫైనాన్షియల్ రిస్క్, నిర్మాణం ఆలస్యం కావడం, అనుమతుల మంజూరులో జాప్యం తదితరాలు బయ్యర్లను దూరంగా ఉంచుతున్నాయని, అన్నీ సక్రమంగా ఉన్న ప్రాజెక్టుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఇందుకు మరో కారణమని ఆయన అన్నారు. అమ్ముడుపోని అపార్టుమెంట్ల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, నిర్మాణరంగం పట్ల ప్రజలు అంతగా ఆసక్తిని చూపడం లేదని వివరించారు. ప్రాజెక్టులు పూర్తయిన తరువాత మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలు భావిస్తుండగా, నిధుల లేమితో రియల్ ఎస్టేట్ సంస్థలు ఎన్నో ప్రాజెక్టులను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. అపార్టుమెంట్ల విక్రయాలు సాగుతుంటే, ధరలు దిగివస్తాయని, ఆ పరిస్థితి లేకనే ధరలు తగ్గడం లేదని నిర్మాణరంగ నిపుణులు భావిస్తున్నారు. నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల్లో అమ్మకాలు ఎంతమాత్రమూ సాగకపోవడంతో, డెవలపర్ల దగ్గర పెట్టుబడులు పెట్టేందుకు డబ్బు కరవైందని, అందువల్లే ఈ రంగంలో మాంద్యం ఏర్పడిందని లిమాయే వివరించారు.

  • Loading...

More Telugu News