: పిచ్చికూతలు ఆపంటూ, విలేకరికి చీవాట్లు పెట్టిన బరాక్ ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కోపం వచ్చింది. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయారు. సీబీఎస్ న్యూస్ కు వైట్ హౌస్ తరపున పనిచేస్తున్న రిపోర్టరును చీవాట్లు పెట్టారు. పిచ్చికూతలు వద్దని, మరింతగా తెలుసుకుని మాట్లాడాలని క్లాస్ పీకారు. ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న అమెరికన్ పౌరుల విషయంలో ప్రశ్నించిన రిపోర్టర్ మేజర్ గారెట్, వారిని విడిపించేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించారు. ఇరాన్ తో అణు ఒప్పందం విషయంలో చర్చలు ఫలప్రదమౌతున్న వేళ, అక్కడి జైళ్లలోని యూఎస్ పౌరులను బయటకు తెచ్చేందుకు చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇది ఒబామాకు కోపం తెప్పించింది. "మేజర్... మీరడిగిన ప్రశ్న ఇరాన్ జైళ్లలో అమెరికన్లు మగ్గుతుంటే నేనేదో ఆనందంగా ఉన్నట్టు ఉంది. అదంతా నాన్సెన్స్, మీరు విషయాన్ని లోతుగా తెలుసుకోవాలి" అన్నారు. అంతకుముందు మీ ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఇరాన్ జైళ్లలో నలుగురు అమెరికా పౌరులు మగ్గుతున్నారని, ముగ్గురిపై తప్పుడు కేసులు బనాయించబడ్డాయని, ఒకరి ఆచూకీ, అతనిపై ఉన్న కేసుల వివరాలు తెలియదని గారెట్ గుర్తు చేశారు. "సార్... మీరు ఈ దేశ పౌరులకు చెప్పగలరా? అసలేం జరుగుతుంది? ఆ నలుగురు అమెరికన్లకు, దేశానికి సంబంధం లేదా? ఈ దేశ శక్తి వారిని వెనక్కు తేలేదా?" అని ఆయన ఒబామాను ప్రశ్నించారు. అసలు అటువంటి ప్రశ్నలు ఎందుకడుగుతున్నారని ప్రశ్నించిన ఒబామా, బాధితుల కుటుంబాలను తాను కలుసుకున్నానని, వారిని బయటకు తెచ్చేందుకు ద్వైపాక్షిక అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.