: పుష్కరాల్లో రివాల్వర్ కలకలం... కొవ్వూరు గౌతమి ఘాట్ లో ఘటన
పవిత్ర గోదావరి పుష్కరాల్లో నేటి ఉదయం ఓ రివాల్వర్ కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఏర్పాటు చేసిన గౌతమి ఘాట్ లో నేటి ఉదయం పారిశుద్ధ్య కార్మికులకు ఓ రివాల్వర్ కనిపించింది. వెనువెంటనే కార్మికులు రివాల్వర్ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఓ మూలగా పడి ఉన్న రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్న అక్కడి పోలీసులు డీఎస్పీ స్థాయి అధికారికి దానిని అప్పగించారు. రివాల్వర్ ను పరిశీలించగా, అది లైసెన్స్ డ్ రివాల్వరేనన్న విషయం తేలింది. రివాల్వర్ ను దాని యజమాని పొరపాటుగా మరిచిపోయారా? లేక మరేదైనా కారణముందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు కొవ్వూరు ఘాట్ ను సందర్శించనున్న నేపథ్యంలో రివాల్వర్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.