: మొబైల్ విప్లవాన్ని గుర్తించలేకపోయాం... అది చారిత్రక తప్పిదమేనన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
టెక్నాలజీ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థగా ఎదిగిన మైక్రోసాఫ్ట్ కూడా చారిత్రక తప్పిదం చేసిందట. భవిష్యత్తు అంతా పర్సనల్ కంప్యూటర్లదేనని లెక్కలు కట్టిన ఆ సంస్థ, మొబైల్ ఫోన్ విప్లవాన్ని గుర్తించడంలో ఘోరంగా విఫలమైందట. తద్వారా తమ సంస్థ చారిత్రక తప్పిదం చేసిందని ఆ సంస్థ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 90వ దశకంలో తాను మైక్రోసాఫ్ట్ లో చేరేనాటికి పర్సనల్ కంప్యూటర్ల హవా నడుస్తోందని ఆయన అన్నారు. ప్రతి ఇంటిలో పీసీ ఉండాలన్న ఏకైక లక్ష్యంతోనే నాడు ముందుకెళ్లామని, ఈ కారణంగానే సంస్థ మొబైల్ ఫోన్ రంగంపై దృష్టి సారించలేకపోయిందని కూడా ఆయన అన్నారు. అయితే భవిష్యత్తులోనూ మొబైల్ ఫోనే రాజ్యమేలుతుందని చెప్పలేమని సత్య నాదెళ్ల అన్నారు. అలా భావిస్తే, మరోమారు చారిత్రక తప్పిదం చేసినట్లే అవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.