: జూపల్లి సవాల్...రావుల ప్రతి సవాల్
పాలమూరు ప్రాజెక్టుపై తెలంగాణ టీఆర్ఎస్, టీడీపీ నేతల మధ్య సవాల్, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూ, చర్చకు సవాలు విసురుతున్నారు. దీనికి టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా సమాధానమిస్తూ చేతనైతే నిరూపించాలంటూ ప్రతిసవాల్ విసిరారు. దీనిపై స్పందించిన జూపల్లి ఈ నెల 11న టీడీపీ భవన్ కు వస్తానని, చర్చకు సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు. ఆయన వస్తారని నాలుగు గంటలపాటు 11వ తేదీన ఎదురు చూశానని, జూపల్లి వెన్నుచూపారని రావుల తెలిపారు. అనంతరం ఈ నెల 13, 15, 16న చర్చకు వస్తానని జూపల్లి తెలిపారు. దీంతో ఎదురు చూసినప్పుడు వెన్ను చూపి, నచ్చినప్పుడు వస్తానని చెప్పడం సరికాదని రావుల ఎద్దేవా చేశారు. దీంతో రేపు ఉదయం పది గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని, చేతనైతే రావుల చర్చకు రావాలని జూపల్లి మరోసారి సవాలు విసిరారు... జూపల్లి చెప్పినట్టల్లా చేయడానికి సిద్ధంగా లేమని, చర్చకు రావాలంటే టీవీ9 స్టూడియోకు రావాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రావుల ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఏం జరుగుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.