: ‘అమావాస్య’ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు...రాజమండ్రిలో 12 గంటలకే 4 లక్షల మంది రాక
గోదావరి పుష్కరాల్లో భాగంగా నేడు పుష్కర ఘాట్లకు భక్తజనం పోటెత్తింది. పుష్కర సమయం, అమావాస్య కలిసివచ్చిన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాల కోసం తరలివస్తున్నారు. నేటి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల సమయానికే రాజమండ్రిలోని పుష్కర ఘాట్లలో 4 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలాచరించారు. సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల రాక అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్క రాజమండ్రిలోనే నేటి రాత్రిలోగా 15 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్నటితో పోలిస్తే నేడు పుష్కరాలకు వస్తున్న భక్తుల సంఖ్య 30 శాతం మేర పెరిగిందని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఇదిలా ఉంటే, తొలిరోజు పుష్కరాల్లో భాగంగా నిన్న తెలంగాణలోని పుష్కర ఘాట్లకు భక్తులు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే నేడు అమావాస్యను పురస్కరించుకుని తెలంగాణలోని ధర్మపురి, బాసర, కాళేశ్వరం, భద్రాచలం పుష్కర ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.