: ఐపీఎల్ లో కొత్త ఫ్రాంచైజీ కోసం పొట్లూరి వరప్రసాద్ గ్రూప్ యత్నం!
ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై లోథా కమిటీ రెండేళ్ల నిషేధం విధించడంతో కొత్త ఫ్రాంచైజీల విషయం తెరపైకి వచ్చింది. తదుపరి ఐపీఎల్ లో ఆ రెండు జట్ల స్థానాన్ని బీసీసీఐ ఎలా భర్తీ చేస్తుందన్న దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తక్కువ జట్లతో ఐపీఎల్ నిర్వహించే సాహసాన్ని బోర్డు చేయబోదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టింగ్ హక్కులతో ముడిపడిన వ్యవహారం కాబట్టి, వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడించేందుకే బోర్డు సదా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో, కొత్త ఫ్రాంచైజీల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్తలు రంగంలోకి దిగినట్టు సమాచారం. వారిలో ముఖ్యంగా, పీవీపీ గ్రూప్ అధినేత, తెలుగువాడైన పొట్లూరి వరప్రసాద్ కూడా ఉన్నారని తెలిసింది. ఇప్పటికే ఈయన ఓసారి ఫ్రాంచైజీ కోసం విఫలయత్నం చేశారు. 2012లో వరప్రసాద్ డెక్కన్ చార్జర్స్ ను కొనుగోలు చేసేందుకు యత్నించినా, అది వీలుకాలేదు. ఆ ఫ్రాంచైజీని సన్ టీవీ గ్రూప్ చేజిక్కించుకుంది. దీంతో, ఈసారి ఎలాగైనా ఓ ఫ్రాంచైజీని దక్కించుకోవాలన్న కసితో ఆయన బరిలో దిగినట్టు అర్థమవుతోంది. ఇక, హీరో గ్రూప్, అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వీడియోకాన్ తదితర బడా గ్రూపులు కూడా ప్రయత్నాలు ప్రారంభించాయన్న వార్తల నేపథ్యంలో కొత్త ఫ్రాంచైజీల కోసం పోటీ తీవ్రం కానుంది.