: రాయల్ ఎన్ ఫీల్డ్ పై తుమ్మల, హరీశ్... వాకీటాకీలు చేతబట్టి ట్రాఫిక్ ను నియంత్రించిన వైనం!
తుమ్మల నాగేశ్వరరావు, తన్నీరు హరీశ్ రావు... ఇద్దరూ తెలంగాణ కేబినెట్ లో కీలక మంత్రులు. తుమ్మల రోడ్లు, భవనాల శాఖను పర్యవేక్షిస్తుంటే; హరీశ్ రావు భారీ నీటిపారుదల శాఖతో పాటు మార్కెటింగ్ శాఖ బాధ్యతలను మోస్తున్నారు. అయితే నిన్న వీరిద్దరూ ట్రాఫిక్ కానిస్టేబుళ్ల అవతారం ఎత్తారు. ట్రాఫిక్ సిబ్బందిలానే వాకీటాకీలు చేతబట్టి పుష్కరాల సందర్భంగా రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. వివరాల్లోకెళితే... నిన్న తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో పెద్ద ఎత్తున పుష్కర ఘాట్లు ఏర్పాటయ్యాయి. వీటిలో పుష్కరస్నానం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో భద్రాచలం-సారపాక వంతెనపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న తుమ్మల తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై హరీశ్ రావును కూర్చోబెట్టుకుని అక్కడకు బయలుదేరారు. వంతెన వద్దకు చేరుకున్న మంత్రులిద్దరూ వాకీటాకీలను చేతబట్టి క్షణాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఖమ్మం జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీంకు ట్రాఫిక్ నియంత్రణపై పలు సూచనలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.