: పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం... తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం
144 ఏళ్ల తర్వాత వచ్చిన గోదావరి మహా పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతోంది. నిన్న ఉదయం 6.21 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. గోదావరి తీరం మొత్తం జనసంద్రంలా మారింది. నిన్న ఉదయం నుంచి నిర్ణీత సమయం ముగిసేలోగా దాదాపు 24 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించినట్లు అనధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లలోనే దాదాపు 10 లక్షల మంది పుష్కర స్నానం చేసినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురంలతో పాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఘాట్ లకు నిన్న 6 లక్షల మంది తరలివచ్చారు. ఇక తెలంగాణ పరిధిలోని ధర్మపురి, బాసర, భద్రాచలం, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే 8 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేసినట్లు సమాచారం. త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం ఘాట్ లోనే నిన్న 2 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేశారు.