: ఒక రూపాయికే ఆకాశయానం... ‘రెడ్ హాట్ స్పైసీ’ పేరిట స్పైస్ జెట్ కొత్త ఆఫర్!
వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది ముమ్మాటికీ నిజం. కేవలం ఒకే ఒక్క రూపాయి చెల్లించి విమానం ఎక్కేయొచ్చు. ఎంచక్కా ఎంపిక చేసుకున్న గమ్యస్థానం చేరుకోవచ్చు. అయితే ఈ తరహా టికెట్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లభ్యం. విమానయానాన్ని సామాన్యుడికి చేరువ చేయడంలో తనవంతు పాత్రను పోషించిన ‘స్పైస్ జెట్’ వినూత్న ఆపర్లకు పెట్టింది పేరు. తాజాగా ఈ సంస్థ ‘రెడ్ హాట్ స్పైసీ’ పేరిట ఓ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీని ప్రకారం నేటి ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎంపిక చేసిన మార్గాల్లో స్పైస్ జెట్ మొబైల్ యాప్ ద్వారా రూ.1 కే జర్నీ టికెట్లను కొనుక్కోవచ్చు. అయితే ఈ రూ.1 టికెట్ ‘వన్ వే’ ప్రయాణానికి మాత్రమే పరిమితం. రిటర్న్ జర్నీని ఆ సంస్థ విమానంలోనే చేయాల్సి ఉంటుంది. అంతేకాక సదరు రిటర్న్ జర్నీ టికెట్ ను సాధారణ ధర చెల్లించి కొనుక్కోవాల్సిందే. ఈ టికెట్ కొనుగోలు చేస్తేనే, రూ.1 టికెట్ లభించనుంది. ఇక టికెట్ రూ.1 అయినా, దానిపై పన్నులు ఇతరత్రా సర్వీస్ ట్యాక్స్ లను కూడా ప్రయాణికులే భరించాలట. టికెట్ల బుకింగ్ మూడు రోజులకే పరిమితమైనా, ఈ టికెట్లతో ఈ 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణం చేయవచ్చు. గతేడాది ఇదే తరహాలో ప్రకటించిన తమ ఆఫర్ కు జనం నుంచి భారీ స్పందన వచ్చిన నేపథ్యంలోనే ఈ ఏడాది ‘రెడ్ హాట్ స్పైసీ’ని ప్రకటిస్తున్నట్లు సంస్థ సీఓఓ సంజీవ్ కపూర్ తెలిపారు.