: వారి విశ్వసనీయతను ప్రశ్నించలేం: లోథా కమిటీ నిర్ణయంపై గవాస్కర్ స్పందన
ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన ఆర్.ఎం.లోథా కమిటీ సంచలన నిర్ణయాలు వెలువరించడం తెలిసిందే. ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండేళ్ల పాటు బహిష్కరించడమే గాకుండా, గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రాలను జీవితకాలం పాటు క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధించింది. దీనిపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. లోథా కమిటీ జడ్జిమెంట్ ను తేలిగ్గా తీసుకోలేమని అన్నారు. ఆ కమిటీలో ముగ్గురు మాజీ చీఫ్ జస్టిస్ లు ఉన్నారని, వారి నిర్ణయాలకు విలువ ఇవ్వాల్సిందేనని, వారి విశ్వసనీయతను, సమగ్రతను ప్రశ్నించలేమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో చెన్నై, రాజస్థాన్ ఆటగాళ్లు తప్పకుండా తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. ఇక, మహేంద్ర సింగ్ ధోనీ లేని ఐపీఎల్ ను ఊహించుకోలేమని అన్నారు. ధోనీ వయసు ప్రస్తుతం 34 ఏళ్లేనని చెబుతూ, మరికొంతకాలం ఆడే సత్తా ఉందని అభిప్రాయపడ్డారు. ధోనీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. అంతకుముందు, లోథా కమిటీ తన నిర్ణయాలు వెల్లడిస్తూ.... రెండు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ఇక ఏ జట్టుకైనా ఆడవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపైనా సన్నీ తన అభిప్రాయాలు తెలిపారు. ఐపీఎల్ తదుపరి సీజన్ కు కనీసం 8 నెలల సమయం మిగిలున్నందున, బీసీసీఐ ఈలోగా రెండు కొత్త ఫ్రాంచైజీలను లీగ్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు.