: సీఎం చంద్రబాబుపై జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు
పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట చోటుచేసుకుని 27 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యుడని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా, ఘటనకు చంద్రబాబే కారణమంటూ ఆయనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి)లో ఫిర్యాదు దాఖలైంది. వీరరాఘవరెడ్డి అనే న్యాయవాది బాబుపై ఫిర్యాదు చేశారు. పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయలేదని, తొక్కిసలాట ఘటన చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవడంలో ఏపీ సర్కారు విఫలమైందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును ఎన్.హెచ్.ఆర్.సి విచారణకు స్వీకరించింది.