: బూబీ ట్రాప్ శిక్షణలో పసిబిడ్డను పేల్చేసిన ఐఎస్ కిరాతకులు
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు దారుణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా, బూబీ ట్రాప్ (ప్రత్యర్థులను ఉచ్చులోకి లాగి కడతేర్చే టెక్నిక్) శిక్షణలో భాగంగా ఓ పసిబిడ్డను పేల్చివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇరాక్ కు చెందిన ప్రొవిన్షియల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ సాదిఖ్ ఎల్ హుస్సేనీ ఘటనను ఓ న్యూస్ వెబ్ సైట్ కు వివరించారు. "కొన్ని వారాల క్రితం ఓ వ్యక్తిని ఐఎస్ మిలిటెంట్లు చంపేశారు. తమ సహచరుడి మరణంలో ఆ వ్యక్తి పాత్ర కూడా ఉందన్న నెపంతో అతడిని అంతమొందించారా కిరాతకులు. ఇప్పుడా వ్యక్తి కన్నబిడ్డను సైతం బలిగొన్నారు. మిలిటెంట్లకు బూబీ ట్రాప్ శిక్షణలో భాగంగా చిన్నారికి పేలుడు పదార్థాలు అమర్చారు. సాయుధ మిలిటెంట్లు చూస్తూ ఉండగా పేల్చేశారు" అని వివరించారు. చిన్నారులు, మహిళల పట్ల ఐఎస్ దురాగతాలు ఇంతకుముందు కూడా జరిగాయి. గతంలో ఐదేళ్ల బాలుడిని సగానికి నరికేయడం అందరినీ కలచివేసింది. 2013లో ఈశాన్య సిరియాలో ఓ బస్సును ఆపి, అందులోని 40 రోజుల పసికందును అత్యంత హేయమైన రీతిలో చంపేశారు. నిర్దయగా తలను వేరుచేసి రాక్షసత్వాన్ని చాటుకున్నారు. కాగా, శిశువులను తినేందుకు ఐఎస్ఐఎస్ అధినేత అల్ బాగ్దాదీ మిలిటెంట్లకు అనుమతి ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది.