: 3 గంటలకు రాజమండ్రికి వెళ్తున్న చిరంజీవి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి ఫైర్ అయ్యారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... కృష్ణా పుష్కరాల సమయంలో ఒకరో, ఇద్దరో చనిపోతే నానా యాగీ చేసిన చంద్రబాబు ఇప్పుడేం మాట్లాడతారని ప్రశ్నించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలంటూ పట్టుబట్టిన చంద్రబాబు... ఇప్పుడు రాజీనామా చేయగలరా? అని నిలదీశారు. ఆయన చస్తే రాజీనామా చేయరని అన్నారు. మహా కుంభమేళాకు గోదావరి పుష్కరాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది వస్తారని... అయినా అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగడం లేదని అన్నారు. ఈ సందర్భంగా మీడియాను కూడా చిరంజీవి తప్పుబట్టారు. కొంతమంది మీడియా వ్యక్తులు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇలాంటి ఘోరాలు కూడా వారికి పట్టవా? అని అన్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు తాను, రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు రాజమండ్రి బయలుదేరి వెళ్తున్నామని చెప్పారు. రాజమండ్రిలో మృతుల సంబంధీకుల్ని పరామర్శిస్తామని, చికిత్స పొందుతున్న వారిని కలుస్తామని, పుష్కర ఏర్పాట్లను పరిశీలిస్తామని తెలిపారు.