: మధుకోడాపై ‘బొగ్గు’ కొరడా ఝుళిపించండి... సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం
బొగ్గు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాపై అభియోగాలు నమోదు చేయాలని సీబీఐ అధికారులకు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక అభియోగాల నమోదుకు సుదీర్ఘ కాలం తీసుకోవడానికి వీలులేదని చెప్పిన కోర్టు, ఈ నెల 31 లోగా ఆ పనిని పూర్తి చేయాలని స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో మధుకోడాకు ప్రత్యక్ష ప్రమేయమున్నట్లు ఇదివరకే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక కోర్టు సీబీఐకి పలు కీలక సూచనలు చేసింది. మధుకోడాతో పాటు కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్.సీ గుప్తా, జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసు సహా మొత్తం ఎనిమిది మందిపై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు సీబీఐ అధికారులను ఆదేశించింది.