: ప్రియుడితో కలిసి వాట్సప్ డ్రామా!... రాజేంద్రనగర్ కిడ్నాప్ కేసులో అసలు కోణమిదే!
రాజేంద్రనగర్ లో కిడ్నాప్ నకు గురైన మహిళే అసలు నిందితురాలని పోలీసులు తేల్చారు. భర్తకు దూరం కావాలన్న భావనతో ప్రియుడితో కలిసి ఆమె పెద్ద డ్రామానే నడిపిందట. అయితే కోల్ కతాకు వెళ్లిన సైబరాబాదు పోలీసులు ఆమెతో పాటు ఆమె డ్రామాకు సహకరించిన ప్రియుడికీ సంకెళ్లేసి తీసుకొచ్చారు. విచారణలో భాగంగా సదరు మహిళ తన డ్రామాను బయటపెట్టక తప్పలేదు. వివరాల్లోకెళితే... రాజేంద్రనగర్ కు చెందిన రాధిక, తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే పెంపుడు తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా ప్రేమించిన మహేశ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. 2011లో ప్లేటాక్ సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా బీహార్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ అలియాస్ ఉజ్రాన్ అల్ ఇష్క్ తో ఆమెకు పరిచయమేర్పడింది. హితేశామ్ పేరుతో రాధికకు పరిచయమైన రిజ్వాన్ క్రమంగా మాటలు కలిపాడు. రాధిక కూడా తనకు పెళ్లి కాలేదనే అతడికి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో భర్తకు దూరం కావాలని భావించిన రాధిక రిజ్వాన్ తో కలిసి పక్కా ప్రణాళిక రచించింది. గుట్టుచప్పుడు కాకుండా భర్త, కూతురును వదిలేసిన రాధిక, రిజ్వాన్ తో పరారైంది. రాజేంద్రనగర్ నుంచి మాయమైన వీరిద్దరూ తొలుత ఒడిశా చేరుకుని అక్కడి నుంచి కోల్ కతా చేరుకున్నారు. అక్కడికెళ్లేసరికి వారివద్ద ఉన్న రూ.20 వేలు ఖర్చైపోవడంతో మహేశ్ నుంచి డబ్బు లాగేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా తిలకంతో నీళ్లను కలిపి రక్తంలా మార్చి రాధిక ముఖానికి పూసిన రిజ్వాన్ ఆమెను బంధించినట్లు ఫొటోలు తీశాడు. వాటిని వాట్సప్ లో పెట్టి రూ.3 లక్షలిస్తే రాధికను వదిలేస్తానని మహేశ్ కుమార్ కు మెసేజ్ పెట్టాడు. అంతేకాక తన బ్యాంక్ అకౌంట్ నెంబరునూ ఇచ్చాడు. డబ్బు సర్దుతానని చెప్పిన మహేశ్ పోలీసులను ఆశ్రయించాడు. కిడ్నాప్ ఘటనపై కాస్త అనుమానం కలిగిన పోలీసులు రిజ్వాన్ బ్యాంక్ అకౌంట్ లో రూ.10,500 డిపాజిట్ చేయించారు. ఖాతాలో పడ్డ డబ్బును రిజ్వాన్ డ్రా చేసుకోగా... అతడి సెల్ ఫోన్, ఏటీఎం కేంద్రం లోకేషన్ ను గుర్తించిన పోలీసులు అక్కడికెళ్లి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.