: హెలి'నా' సక్సెస్... కొత్త రూపం సంతరించుకున్న నాగ్ క్షిపణి
దేశీయంగా రూపొందించిన యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ తాజా ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంలో నాగ్ హెలికాప్టర్ వెర్షన్ హెలి'నా'ను ప్రయోగించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి మూడు రౌండ్ల ప్రయోగం నిర్వహించారు. మూడు సార్లు ప్రయోగించగా హెలి'నా' రెండు సార్లు నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఓ ప్రయత్నం విఫలమైనట్టు పేర్కొన్నాయి. ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసేందుకోసం ఈ మిసైల్ తయారుచేశారు. తాజా ప్రయోగ ఫలితాలను విశ్లేషించాల్సి ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.