: సానియాను విస్మరించిన బీబీసీ... వెంటనే స్పందించిన స్మృతీ ఇరానీ

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో సానియా మీర్జా విజయం పట్ల యావత్ భారతదేశం ఉప్పొంగిపోతోంది. సానియా మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్ జతగా టైటిల్ కైవసం చేసుకుంది. ఆమె విజయాన్ని భారత మీడియా విశేషంగా కొనియాడింది. అయితే, బీబీసీ ఇండియా విభాగం మాత్రం భిన్నంగా స్పందించింది. సానియా పేరును ప్రస్తావించకుండా "హింగిస్ వింబుల్డన్ డబుల్స్ ఫైనల్లో విజయం సాధించింది" అని తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొంది. దీనిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె వెంటనే స్పందించారు. బీబీసీ తప్పిదాన్ని ఎత్తిచూపుతూ "బీబీసీ ఇండియా... సానియా కూడా గెలిచినట్టే కదా!" అని ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. అటుపై బీబీసీ ఇండియా తన ట్వీట్ ను టైమ్ లైన్ నుంచి తొలగించింది.