: 'గగన్'తో దూరాలు తరిగిపోతాయి... అమెరికా, యూరప్ దేశాల సరసన భారత్!
విమానయాన కార్యకలాపాలకు విశేషంగా సహకరించే అధునాతన నేవిగేషన్ సిస్టమ్ 'గగన్' ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సోమవారం ఆవిష్కరించారు. ఈ జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నేవిగేషన్ (గగన్) వ్యవస్థ కారణంగా ఓ నగరం నుంచి మరో నగరానికి మధ్య విమానాలు కచ్చితమైన మార్గంలో ప్రయాణించే సౌలభ్యం కలుగుతుంది. దిశను కచ్చితంగా అంచనా వేయడం వల్ల దూరం తగ్గుతుంది. తద్వారా సమయం ఆదా అవడమేగాకుండా, ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. సమర్థవంతమైన నేవిగేషన్ సిస్టమ్ లేని కారణంగా, ఇప్పటివరకు ఆయా నగరాలకు చేరుకోవాలంటే కొన్నిసార్లు విమానాలు చుట్టూ తిరిగి వెళ్లడం కారణంగా అధిక దూరం ప్రయాణించాల్సి వచ్చేది. గగన్ ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని భారత్ భావిస్తోంది. ఈ సూపర్ నేవిగేషన్ సిస్టమ్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 'గగన్' రూపకల్పన కోసం దాదాపు రూ.774 కోట్లు ఖర్చయ్యాయి. ఇది ప్రధానంగా శాటిలైట్ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థ. రోదసిలోని మూడు శాటిలైట్లు భారత గగనతలాన్నే కాకుండా, సార్క్ దేశాల గగనతలాన్ని కూడా పరిశీలిస్తుంటాయి. విమానాల ప్రతి కదలికను ఇవి గుర్తించి విశ్లేషణ కేంద్రాలకు చేరవేస్తాయి. గగన్ రంగప్రవేశంతో భారత్... అమెరికా, జపాన్, యూరప్ సరసన చేరింది. మరే ఇతర దేశాలకు ఇంతటి అధునాతన నేవిగేషన్ వ్యవస్థ అందుబాటులో లేదు.